Friday 14 September 2007

వినాయక చవితి శుభాకాంక్షలు




శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం
ప్రసన్న వదనం ద్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిషం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే

అన్ని దేవుళ్ళలో వినాయకుడు ప్రథముడు.ఏదైనా ఒక పుణ్యకార్యం తలపెట్టినప్పుడు ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి అంటారు. వినాయకుడు సమస్త విఘ్నాలకు అధిపతి. వాటి నివారణ ఆయన ఆధీనంలో ఉంటుందంటారు.అందువల్లనే సమస్త శుభకార్యాలకు ప్రారంభంలో గణపతి పూజ చేయలంటారు మన పెద్దలు.

వినాయక చవితి సందర్భంగా భక్తులు సకలాభిష్ట సిద్ది కోసం ఈ మంత్రాన్ని చదువుతారు.

గణేశమేకదంతం చ
హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం
గజవక్త్రం గుహాగ్రజం

అన్నట్టు చెప్పడం మరిచిపోయాను.వినాయకున్ని పూజిస్తే మంచి బుద్ది, చదువు వస్తుందండోయ్.ఇక ఎందుకు ఆలస్యం మనసారా పూజిద్దాము మరి.

Wednesday 5 September 2007

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

మాతృదేవో భవ, పితృదేవో భవ ,ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు. మనకు ఎవరికైనా అమ్మ నాన్నల తర్వాత గురువే ముఖ్యమైన దైవం. మనమందరం ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉన్నామంటే దానికి కారణం గురువే.అందుకని మనం ఆ గురువుని ఎప్పుడు పూజించాలి, గౌరవించాలి.

మంచి,చెడులని చెప్పి అజ్ఞానాన్ని తొలగించి మంచి అనే మార్గంలో మనల్ని నడిపించే భోధన చేసిన గురువు దేవుడితో సమానం.
"గు" అంటే అంధకారం అని, "రు" అంటే దానిని నిర్మూలించే పరబ్రహ్మం అని అర్థం.అజ్ఞానమనే అంధకారాన్ని పోగోట్టి జ్ఞానాన్నిచ్చే వ్యక్తే "గురువు".

గురువును గౌరవించే శిష్యులు, శిష్యులపై ప్రేమామృతం కురిపించే గురువులు నెలకొన్న విద్యావ్యవస్థ భారతీయుల విద్యకు అద్దం పట్టగలదు.గురువుల్లో సేవాభావం, తాత్వికత, నిబద్దత ఉండాలి.విశ్వవిఖ్యాత తాత్వికుడు, ఆదర్శ ఉపాద్యాయుడు అయిన సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని భావనలు అధ్యాపక లోకానికి స్పూర్తి కావాలి.

నాకు మా ఉపాధ్యులలో చాలా ఇష్టమైన వాళ్లు కిషన్ సర్,లచ్చన్న సర్,వెంకట రమణ రెడ్డి సర్, వేణు సర్,సంతోష్ సర్,నవీన్ సర్.మీరందరు ఎక్కడ ఉన్నా నా హృదయపూర్వక నమస్కారాలు.

Wednesday 29 August 2007

సంతృప్తి

మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.

మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.